దేశంలో ఎక్కడా లేనివిధంగా.. తెలంగాణలో : మంత్రి శ్రీనివాస్ గౌడ్
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళిత జాతి ఎన్నో అవమానాలకు, అణిచివేతలకు గురైందన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికి ఇంకా అక్కడక్కడ వివక్షత కొనసాగడం బాధాకరమన్నారు. ఇలాంటి వివక్షతను అందరం అణచి వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాంటి వ్యవస్థను కూకటివేళ్లతో సహా పెకలించి వేయాలని పిలుపునిచ్చార. దళితులు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి సాధ్యమని అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ రచన వల్ల దళితులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించారని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో ఉద్యోగాలతో పాటు, అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పిస్తున్నామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. దళిత బంధు ద్వారా ఒక్కో ఎస్సీ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందచేయడమే కాక దళితులకు అన్ని రంగాలలో, ఆర్థిక వనరులు ఉన్న ప్రతి చోట అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు.













