వారి పేర్లు త్వరలోనే బయటపెడతా : మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైకోర్టు డిస్మిస్ చేసిన కేసులో కొందరు తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన ఎన్నికల అఫిడవిట్ వ్యవహారంపై కోర్టులో కేసు నడుస్తోందంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కోలేని వారే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకున్న ఆదరణ తట్టుకోలేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలోనే తనపై కొందరు కుట్ర చేశారని తెలిపారు. తన పేరుతో ఉన్న మరో వ్యక్తితో నామినేషన్ వేయించారని, కారు గుర్తును పోలి ఉన్న రోడ్డు రోలర్ గుర్తుతో పోటీ చేశారని ఆరోపించారు. బడుగు బలహీనవర్గాల నేతలంటే పెద్ద కులానికి చెందిన ఇద్దరు నేతలకు కంటగింపుగా ఉందని అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారి పేర్లు త్వరలోనే బయటపెడతానని తెలిపారు. ఓ మాజీ మంత్రి, మాజీ ఎంపీ తనపై అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.













