దేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం.. ఏదో తెలుసా ?
ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆరున్నరేళ్ల వ్యవధిలో 73 శాతం జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని చెప్పారు. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌కు కొత్తగా 60 మంది సిబ్బంది నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యాక్రమలో సీఎస్ సోమేశ్ కుమార్‌తో కలిసి మంత్రి వారికి నియామకపత్రాలు అందించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ విభాగంలో టీఆర్ఎస్ సర్కార్ నియామకాలు చేపట్టిందని వెల్లడించారు. లాక్డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా, పీఆర్సీ నివేదిక ప్రకారం 7శాతం వేతనాలు పెంచాలని చెప్పినా, 30 శాతం పీఆర్సీ ప్రకటించి ఉద్యోగుల పట్ల తనకున్న ప్రేమను కేసీఆర్ చాటుకున్నారని తెలిపారు. ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఉద్యోగులకు జీతాలు పెంచిందని, ఉద్యోగులు కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని కోరారు.
గతంలో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా రవాణా అయ్యేందని చెప్పారు. ప్రస్తుతం అక్రమ రవాణాను అరికట్టామని, దీంతో ఆదాయం పెరిగిందని వెల్లడించారు. కొత్తగా నియమితులైన ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆబ్కారీ శాఖ అడిషనల్ కమిషనర్ అజయ్ రావు, రెవెన్యూశాఖ జాయింట్ సెక్రటరీ రాంసింగ్, టీఎస్‌బీసీఎల్ ఓఎస్డీ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













