మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటన

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వచ్చే నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా తొలుత ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) వేడుకల్లో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొంటారు. అనంతరం పెట్టుబడుల సాధన లక్ష్యంగా అధికారిక పర్యటన ప్రారంభమవుతుంది. అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో జూన్ తొలివారంలో జరగనున్న సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రీస్ రెవల్యూషన్ సదస్సులో పాల్గొనడానికి ఇప్పటికే రాష్ట్ర ఐటీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అమెరికా వెళ్లారు. ఈ సదస్సు అనంతరం మంత్రి శ్రీధర్‌బాబుతో పర్యటనలో పాల్గొంటారు.
అమెరికాలోని ప్రముఖ కంపెనీల చైర్మన్లు, సీఈఓలు, ప్రతినిధులతో మంత్రి సమావేశమవుతారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అమెరికాలో పర్యటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కానీ ఇద్దరూ ఒకే సమయంలో వెళ్తారా, వేర్వేరుగానా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది.