ప్రైవేట్ టీచర్లకు సాయం చేయడం దేశంలో ఎక్కడా లేదు : సబితా ఇంద్రారెడ్డి
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక సాయంతో పాటు రేషన్ బియ్యం పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారని రాష్ట్ర విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే టీచర్లు, సిబ్బంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ టీచర్లకు 25 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ప్రారంభించారు. గతేడాది కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి వలస కార్మికులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారని, వారికి నగదు అందజేసి, రేషన్ బియ్యాన్ని ఉచితంగా కూడా ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయంతో పాటు రేషన్ బియ్యాన్ని ఉచితంగా అందజేశామని గుర్తు చేశారు.













