మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు.. గవర్నర్‌పై మండిపడ్డ మంత్రి సబిత
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం ముదురుతోంది. పెండింగ్ బిల్లుల విషయంలో ఇటీవలే ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా యూనివర్సిటీ నియామకాల బిల్లు విషయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై గవర్నర్ మండిపడ్డారు. అయితే తనకు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి ఆరోపణలు మాత్రం చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు అంటే బుధవారం ఉదయం 11 నుంచి గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నామన్న సబిత.. ‘అపాయింట్మెంట్ గురించి రాజ్‌భవన్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. మాకు సమయం ఇస్తే గవర్నర్‌కు ఈ బిల్లుపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని భావించాం. గవర్నర్ మాకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయడం పద్ధతి కాదు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఈ విషయాల్లో అవగాహన లేదని గవర్నర్ అన్నట్లు తెలిసిందన్న ఆమె.. ఏ విషయంలో అయినా తనకు నిజంగానే అవగాహన లేకపోతే అడిగి తెలుసుకుంటానని అన్నారు. త్వరలోనే ఈ విషయంపై పూర్తి సమాచారంతో మీడియా ముందుకు వస్తానని ప్రకటించారు.













