తెలంగాణ, అయోవా రాష్ట్రాలు కలిస్తే అద్భుతాలు : గవర్నర్ ఆడమ్ గ్రెగ్
వ్యవసాయరంగంలో తెలంగాణ, అయోవా రాష్ట్రాలు కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ ఆడమ్ గ్రెగ్ పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలోనే తెలంగాణలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు అద్భుత ప్రగతి సాధించాయని కితాబిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి అయోవా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గత తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ఆడమ్ గ్రెగ్‌కు వివరించారు. రాష్ట్రంలో పెరిగిన సాగు విస్తీర్ణం, ఆహార ధాన్యాల ఉత్పత్తి గురించి తెలిపారు.
అమెరికాలో వ్యవసాయిక రాష్ట్రంగా పేరొందిన అయోవాకు, తెలంగాణకు అనేక సారూప్యతలు ఉన్నాయని అన్నారు. రెండు రాష్ట్రాలు ఆహార ధాన్యాలు పౌల్ట్రీ, మాంసం ఉత్పత్తిలో నంబర్ వన్‌గా నిలిచాయని, భవిష్యత్తులో అనేక అంశాల్లో పరస్పర సహకారానికి అవకాశాలున్నాయని వివరించారు.













