రేణుకా చౌదరికి మంత్రి పువ్వాడ్ సవాల్… దమ్ముంటే
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రేణుక చౌదరిపై మంత్రి పువ్వాడ అజయ్ నిప్పులు చెరిగారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆత్మీయ ప్లీనరీ సందర్భంగా జరిగిన సభలో పువ్వాడ మాట్లాడుతూ రేణుక చౌదరి అవాకులు చవాకులు పేలుతున్నారని, సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆమె మాట్లాడినట్టుగా నేను మాట్లాడలేనని, తనకు తండ్రి, మా పార్టీ అధినేత కేసీఆర్ సభ్యత నేర్పించారని అన్నారు. రేణుక చౌదరి ఎన్నికల అప్పుడు జిల్లాకి రావడం సీట్లు ఇప్పిస్తానని గిరిజనుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం ఆమెకు ఆలవాటని ఆరోపించారు. గత ఏడాది కాలం నుంచి తనపై రేణుక చౌదరి విమర్శలు చేస్తూంటే మా మహిళలు కూడా చాలా ఓపికతతో ఉన్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే రేణుక చౌదరిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రేణుక చౌదరి కుటుంబం సభ్యులు క్లబ్బులకే పరిమితమైందని కూడా ఆరోపించారు. ఆమె ఖమ్మం జిల్లాకు గెస్ట్ మాత్రమే నని, తాను ఇక్కడే పుట్టిన పెరగానని అన్నారు. దమ్ముంటే తనపై పోటీ చేయమని పువ్వాడ సవాల్ విసిరారు.













