దమ్ముంటే నాపై పోటీ చేసి గెలవాలి : మంత్రి పువ్వాడ
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దమ్ముంటే ఖమ్మంలో నాపై పోటీ చేసి గెలవాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ సవాల్ విసిరారు. పాదయాత్రలో భాగంగా ఖమ్మంలో పర్యటిస్తున్న షర్మిల మంత్రి పువ్వాడ అజయ్‌పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షర్మిల పాలేరులో పోటీ చేసినా నా దమ్ము చూపిస్తా అని అన్నారు. అన్నతో పంచాయితీ ఉంటే ఆంధ్రలో చూసుకోవాలని, తెలంగాణకు వచ్చి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. కళ్లలో తూటాలు పేల్చి పరిటాల రవిని హత్య చేసింది మీరేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఉక్కు నుంచి భూముల వరకు అన్ని కబ్జాలు, దందాలు చేసిన ఘనత మీ కుటంబానిదే అన్నారు. మీ తండ్రి పరిపాలనలో జరిగిన అరాచకాలు చూస్తే అరాచకానికే సిగ్గుచేట్టన్నారు. ఒట్టి పుణ్యానికి మంత్రి కాకపోతే మీ అన్నలా డబ్బులిచ్చి తీసుకోవాలా? అని ప్రశ్నించారు. పనిచేసిన వారినే సీఎం కేసీఆర్ గుర్తించి పదవులు ఇస్తారు, అందుకు నేను గర్విస్తున్నా అన్నారు.













