ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు గెలిస్తే వారే హీరో
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇద్దరం పోటీ చేద్దాం, ఎవరు గెలిస్తే వారే హీరో అంటూ సవాల్ విసిరారు. తమ ఇద్దరి మధ్య పోటీలో రేవంత్ రెడ్డి గెలిస్తే, తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. మల్లారెడ్డి విద్యా సంస్థలకు ఎలాంటి అనుమతులు లేవని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఏ గుడిలోనైనా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాజకీయాల్లో రాకముందు నుంచే తనకు విద్యాసంస్థలు ఉన్నాయని వెల్లడించారు. తనకు 600 ఎకరాల భూమి ఉందని, అందులో అసైన్డ్ చెరువులకు సంబంధించిన, కబ్జా భూమి లేదని స్పష్టం చేశారు. అంతా న్యాయబద్దంగా కొనుగోలు చేసి, అభివృద్ధి చేసిన భూమి అని వివరించారు. అలాగే విద్యా సంస్థల్లోని భవాలన్నింటికీ సింగిల్ విండో పద్దతిలో అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు.













