ఆత్మనిర్భర ప్యాకేజీలో కాలానుగుణ మార్పులు రావాలి : కేంద్రానికి కేటీఆర్ లేఖ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి కే. తారక రామారావు లేఖ రాశారు. కరోనా కారణంగా వివిధ పరిశ్రమలతో పాటు సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయని ఆ లేఖలో ప్రస్తావించారు. ఆత్మనిర్భర భారత్ పేరిట కేంద్రం ఓ సహాయ ప్యాకేజీని ప్రకటించిందని, అయితే ఆ ప్యాకేజీ అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సరిపోయేదని, ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయని, ప్యాకేజీ స్వరూపాలను కూడా మార్చాలని ఆ లేఖలో సూచించారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ తోడ్పాటుతో సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమలకు లబ్ధి చేకూర్చడానికి తాము ప్రయత్నిస్తూనే ఉన్నామని, అయితే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో ఆకర్షణీయ అంశాలు తక్కువగా ఉన్నాయని లేఖలో విమర్శించారు. రాష్ట్రంలో 80 శాతానికి పైగా సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమలు ఉన్నాయని, కోవిడ్ కారణంగా దెబ్బతిన్నాయని, 25 శాతం పరిశ్రమలు రాబడులు కూడా కోల్పోయాయని కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం కరోనా రెండో దశ దాటిపోయామని, అతి త్వరలోనే మూడో దశ వచ్చే అవకాశం ఉందని వార్తల వస్తున్న నేపథ్యంలో ఆత్మనిర్భర ప్యాకేజీని సరిదిద్దాలని కోరారు. ఇలా సరిదిద్దడం ద్వారా పరిశ్రమలకు మరింత చేయూతనిచ్చే అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.
ప్యాకేజీ సంక్లిష్టమవుతోంది… గమనించండి… కేటీఆర్
ఆత్మనిర్భర ప్యాకేజీలో భాగంగా సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమలకు సంబంధించి గ్యారంటేడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ స్కీం కోసం బడ్జెట్ కేటాయించారని, అయితే ఇందులో ప్రత్యేక ఆకర్షణ లేదని పరిశ్రమల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పైగా దీనితో లబ్ధి పొందడం కష్టంగా మారిందని, ప్రక్రియ మొత్తం సంక్లిష్టంగా మారిపోయిందని, దీంతో పరిశ్రమలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే అతి తక్కువ రుణం ఎవరికీ సరిపోవడం లేదని, అలాగే కార్పస్ ఫండ్ స్కీమ్ మార్గదర్శకాలు కూడా ఇంకా విడుదల కాలేదని కేటీఆర్ పేర్కొన్నారు. వీటన్నింటి దృష్ట్యా ఆత్మనిర్భర ప్యాకేజీలో మార్పులు, చేర్పులు చేసి, ప్రస్తుతానికి సరిపోయే విధంగా రూపొందించాలని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు.