వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన
హైదరాబాద్ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఖైరతాబాద్‌లోని ఎంఎస్ మక్త, రాజు నగర్లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ముంపునకు గురైన బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు మంత్రి కేటీఆర్ రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ప్రజలెవరూ అధైర్యపడొద్దని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మంత్రి వెంట నగర మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక అధికారులు ఉన్నారు.













