ఆయన మార్గంలోనే కేసీఆర్ తెలంగాణ సాధించారు : కేటీఆర్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అణగారిన వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి అంబేడ్కర్ చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదన్నారు. గతంలో చెప్పినట్లుగానే త్వరలోనే దేశంలోకెల్లా అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని నగరం నడిబొడ్డున ప్రతిష్ఠించబోతున్నట్లు ప్రకటించారు. అందరికీ సమాన హక్కులు ఉండాలని అంబేడ్కర్ చెప్పారని అన్నారు. బోధించు, సమీకరించూ, పోరాడూ అని చెప్పారని, ఆయన మార్గంలోనే కేసీఆర్ తెలంగాణ సాధించారని వెల్లడించారు. రాజ్యాంగబద్దంగా తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి సంబంధించి మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలోనే ఈరోజే ఒప్పందం జరిగిందన్నారు. త్వరలోనే విగ్రహ నిర్మాణం చేపడతామన్నారు. గురుకులాలు స్థాపించి అంబేడ్కర్ ఆశయాలు కొనసాగిస్తున్నాం అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేద పిల్లలకు బ్రహ్మాండమైన అవకాశాలు అందిస్తూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని తెలిపారు.













