పార్టీ పేరు మాత్రమే మారింది కానీ.. డీఎన్ఏ మారలేదు
పార్టీ పేరు మాత్రమే మారింది కానీ డీఎన్ఏ, పార్టీ గుర్తు మారలేదు అని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 14 నెలల కిందట జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించారు. రూ.3 వేల పింఛను ఇస్తామన్నారు. హోం మంత్రి అమిత్ షాను తీసుకొచ్చి నిధుల వరద పారిస్తామని ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఏమయ్యాయి. ఈ 14 నెలల్లో హుజూరాబాద్‌లో ఏం అభివృద్ధి జరిగింది. కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టమని ఇటీవల ఈటల రాజేందర్ అన్నారు. ఈటల అనే వ్యక్తి ఉన్నాడని పరిచయం చేసింది సీఎం కేసీఆర్ కదా? 2004లో టీఆర్ఎస్ టీకెట్ కోసం 33 మంది పోటీపడితే ఈటలకు టికెట్ ఇచ్చారు. ఈటలకు రాజకీయ జన్మనిచ్చింది కేసీఆర్. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దినట్టు తండ్రి లాంటి కేసీఆర్ పట్టుకుని కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టమని ఈటల మాట్లాడుతున్నారు ఇది తగునా? ఎవరి పాలన ఈ దేశానికి అరిష్టమో ప్రజలు ఒక్క సారి ఆలోచించాలని అని కేటీఆర్ అన్నారు.













