ప్రజారోగ్య రికార్డుల్లో తెలంగాణ భేష్ : కేటీఆర్
-వైద్య, ఆరోగ్యరంగాల్లో కేంద్రం జోక్యం ఎందుకు?
-ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ మెరుగైనది
-టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
వైద్యారోగ్య పరిశ్రమపై ప్రభుత్వ జోక్యం పెరిగిపోతున్నదనే వాదనను కేంద్రం పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఔషధాలపై ఖర్చులు, కంపెనీల ప్రయోజనాలు అనే అంశాలపై దృష్టి సారించాలని చెప్పారు. మేకిన్ ఇండియా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడానికి కారణాలు, పరిష్కార మార్గాలను కేంద్రం అన్వేషించాలన్నారు. దేశీయ ఉత్పత్తి సహా ప్రపంచ పోటీని ఎదుర్కొనే సామర్థ్యాన్ని సాధించాలని ఆకాంక్షించారు. వైద్యారోగ్యానికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోవాలి? రాష్ట్రంలోని ఓ మారుమూల ప్రాంతంలోని చర్యలను సైతం ఢిల్లీ నిర్ణయించడం ఎందుకు? అని కేటీఆర్ ప్రశ్నించారు. వైద్యం, విద్యవంటి అంశాల్లో రాష్ర్టాలకు నిధులు, అధికారాలు కేటాయించి, కేంద్రం కీలకమైన విదేశీ, రక్షణ, అభివృద్ధి విషయాలపై దృష్టి పెట్టాలన్నారు. ఆయుష్మా న్ భారత్ కంటే ఉత్తమమైన ఆరోగ్యశ్రీ తెలంగాణలో అమల్లో ఉందన్న కేటీఆర్.. తమ విధానంలో భాగం పంచుకోవాలని కేంద్రం కోరడం ఎందుకన్నారు. కంటివెలుగు ద్వారా దేశంలోనే తొలిసారిగా ప్రజలందరికీ కంటిపరీక్షలు నిర్వహిస్తున్నామని, ఈఎన్టీ పరీక్షలు సైతం చేస్తామని చెప్పారు. ఇలా పూర్తి హెల్త్ ప్రొఫైల్ రూపొందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నదని తెలిపారు. సాంకేతిక వెసులుబాటు ఆధారంగా ప్రజల ప్రమాణాలు పెం చుతున్నామని, ఇదే రీతిలో వివిధ రాష్ర్టాల మధ్య అనుసంధానానికి కేంద్రం ఉత్తమ విధానాలు తీసుకోవాలని సూచించారు.













