హైదరాబాద్ లో ప్రపంచస్థాయి వైద్యసంస్థ : కేటీఆర్
కణ, జన్యు ఆధారిత చికిత్సలు అందించేందుకు హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి వైద్యసంస్థను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమశాఖ మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. సీసీఎంబీ భాగస్వామ్యంతో దీనిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ వరల్డ్ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా మారిందని, ప్రపంచానికి అవసరమైన వ్యాక్సిన్లలో మూడోవంతు రాష్ట్రంలోనే తయారవుతున్నాయని చెప్పారు. హెచ్ఐసీసీలో మూడురోజులపాటు జరుగనున్న బయో ఏషియా-2020 ప్రారంభ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతిష్ఠాత్మక జీనోమ్ వ్యాలీ అవార్డును కార్ల్జూన్కు అందించారు. అనంతరం మాట్లాడుతూ లైఫ్‌సైన్సెస్ రంగానికి హైదరాబాద్ హబ్‌గా నిలిచిందని, ప్రపంచస్థాయి కంపెనీ ఏర్పాటుకు కేంద్రంగా మారిందని చెప్పారు. జాతీయ సగటు ఫార్మా ఉత్పత్తుల్లో హైదరాబాద్‌లోనే 35 శాతం తయారవుతున్నాయని తెలిపారు.
తెలంగాణ లో 800కు పైగా ఫార్మా, బయోటిక్, మెడికల్ టెక్నాజీ కంపెనీలు ఉన్నాయని, వీటీద్వారా 50 బిలియన్ డార్ల మివైన వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. రెండు బిలియన్ డోస్ వ్యాక్సిన్లు అంటే, ప్రపంచానికి అవసరమైన వ్యాక్సిన్ల్లో మూడోవంతు తెలంగాణ లో తయారవుతున్నాయని వివరించారు. తెలంగాణ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ గతంలో తయారుచేసిన టైఫాయిడ్ వాక్సిన్ను ఇటీవలే డబ్ల్యూహెచ్‌వో ఆమోదించిందన్నారు. ఇదే కంపెనీకి చెందిన టైఫాయిడ్ అడ్వాన్స్డ్ వ్యాక్సిన్ ఈరోజే ఆవిష్కరించినట్టు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ విభాగంలో చాలా లక్ష్యాలను చేరుకుంటున్నదని గర్వంగా చెప్పుకొంటున్నామన్నారు. లైఫ్‌సైన్సెస్ రంగంలో ప్రస్తుతమున్న 50 బిలియన్ డాలర్ల లక్ష్యం నుంచి రాబోయే రోజుల్లో 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని.. వచ్చే పదేండ్లలో ఈ రంగాల్లో నాలుగు లక్షలు కొత్త ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.













