తెలంగాణతో పాటు చేవెళ్ల ప్రశాంతంగా ఉండాలంటే… మరోసారి
పనిచేసే ప్రభుత్వాన్ని, నాయకుడిని ప్రోత్సహించడం ప్రజల బాధ్యతని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రెండుసార్లు ప్రజలు ఆశీర్వదిస్తే సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కళ్ల ముందే ఉన్నాయని తెలిపారు. చేవెళ్లకు ఇచ్చిన మాట ప్రకారం 111 జీవోను ఎత్తేశామని గుర్తు చేశారు. ఆ జీవోలో ఉన్న న్యాయపరమైన చిక్కులను పరిష్కరిస్తామని తెలిపారు. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన శాసనసభ్యుల్లో ఒకరని అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించి సీఎంకు ఆయన చెప్తూనే ఉంటారన్నారు. చీమకు కూడా హానిచేయని మనస్తత్వం యాదయ్యదని తెలిపారు. తెలంగాణతో పాటు చేవెళ్ల ప్రశాంతంగా ఉండాలంటే కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. చేవెళ్లలో మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.













