అమెరికాలో దాడికి గురైన విద్యార్థిని ఆదుకుంటాం : మంత్రి కేటీఆర్
అమెరికాలో తెలంగాణ విద్యార్థి కత్తిదాడికి గురవడంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ దాడిలో ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన వరుణ్‌రాజ్(24) గాయపడి అక్కడ చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతుండగా వల్పరేసో నగరంలో ఆ ఘటన చోటు చేసుకుంది. వరుణ్‌రాజ్ జిమ్ నుంచి బయటకు వస్తుండగా జోర్డాన్ ఆండ్రాడే అనే వ్యక్తి కత్తితతో అతడి తలపై పొడిచాడు. నిందితుణ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఘటన వివరాలు డాక్టర్ మానస కాపూరి ఎక్స్ వేదికగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కుమారుణ్ని చూడాలని బాధితుడి తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి తప్పకుండా అవసరమైన సహకారాన్ని అందిస్తామని, భారత రాయబార కార్యాలయంతో కూడా మాట్లాడతామన్నారు.













