టిఎస్ ఐపాస్, టిఎస్ బిపాస్ పాలసీలతో అంతా సులభం : రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్, టీఎస్ బీపాస్ పాలసీలు అందరికీ ఉపయోగపడేలా ఉంటూ, సత్ఫలితాలను సాధిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో మూడు రోజులపాటు జరిగిన ఐఐఏ (ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్) ఉత్సవ్‌ను ఇటీవల ఆయన ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్ మహానగరం దినదినాభివృద్ధి చెందుతోందని, ప్రతి ఒక్కరూ జీవించేందుకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. టీఎస్ ఐపాస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న 15 రోజులలో, టీఎస్ బీపాస్‌లో దరఖాస్తు చేసుకున్న 21 రోజులలో అనుమతులను పొందవచ్చని తెలిపారు. ఈపాలసీల ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని, మధ్యవర్తులు లేకుండా పనులు పారదర్శకంగా జరుగుతాయని చెప్పారు.
నగరంలో అండర్ పాస్‌లను ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుముఖం పట్టిందని అన్నారు. హరితహారంలో భాగంగా 2.5 కోట్ల మొక్కలను నాటామని, రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చనున్నామని తెలిపారు. హైదరాబాద్ మహానగరం ఒకప్పుడు రాజభవనాలు, ఉద్యానవనాలతో ఉండేదని, నగరంలో నిర్మితమైన ప్రతి ప్యాలెస్‌కు గుర్తింపు ఉందని చెప్పారు. చార్మినార్‌తోపాటు కేబుల్‌బ్రిడ్జి హైదరాబాద్ ప్రత్యేకతను తెలుపుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఐఏ తెలంగాణ చాప్టర్ చైర్మన్ ఉదయశంకర్ దోనీ, ఐఐఏ నాట్కాన్ 21 కన్వీనర్ శ్రీధర్ గోపిశెట్టి తదితరులు పాల్గొన్నారు.













