మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం.. మరిన్ని సీఐఐ సదస్సులు
ఫార్మా పరిశ్రమలకు ఒకేచోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులు, పెట్టుబడులకు రాష్ట్రంలో అద్భుతమైన వాతావరణం ఉందని తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు హైదరాబాద్‌లో తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయన్నారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి సంస్థలు అతిపెద్ద క్యాంపస్‌లను నగరంలో ఏర్పాటు చేశాయని తెలిపారు. 2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపయ్యాయి. 2030 నాటికి 250 బిలియన్ డాలర్లు సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం అన్నారు.
హైదరాబాద్‌కు ఎన్నో అనుకూలతలు, బలాలు ఉన్నాయి. లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయి. 9 బిలియన్ టీకాలు నగరంలో ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పతయ్యే టీకాల్లో 50 శాతం హైదరాబాద్‌లోనే తయారవుతాయి. ఫార్మా పరిశ్రమలకు ఒకేచోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నాం. సుల్తాన్పూర్ వద్ద అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటు చేశాం. లైఫ్ సైన్సెస్‌తో పాటు టెక్నాలజీ రంగానికి హైదరాబాద్ అత్యుత్తమ వేదికగా మారింది. ప్రైవేటు రంగంలో ఉపగ్రహాల తయారీ మొట్టమొదటిగా నగరంలోనే జరిగింది. ప్రైవేటుగా రాకెట్ లాంచింగ్ చేసిన స్కైరూట్ సంస్థ ప్రతినిధులకు అభినందనలు తెలియజేస్తున్నా అని అన్నారు.













