3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం : మంత్రి కేటీఆర్
ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శాసనసభా ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
రాష్ట్రంలో 250 కి పైగా కంపెనీల్లో ఎలక్ట్రానిక్ రంగంలో లక్షా 60 వేల మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. విధాన రూకల్పనలో భాగంగా పరిశ్రమల నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి ఒక ప్రత్యేక ఎలక్ట్రానిక్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందిదని, రాష్ట్రంలో విద్యుత్ వాహనాలు, ఇంధన నిల్వ వ్యవస్థలను సత్వరమే చేపట్టి, తయారీ, ఆర్ అండ్ డీని అభివృద్ధి చేసేలా చూడడానికి 2020 నుంచి 30 వరకూ ఇంధన నిల్వల విధానాన్ని ప్రారంభించామని వెల్లడించారు. క్లస్టర్ అభివృద్ధిలో భాగంగా ఓఆర్ఆర్ వెలుపల 912 ఎకరాల విస్తీర్ణంలో రెండు ఎలక్ట్రానిక్ క్లస్టర్ల తయారీని కలిగి ఉందని, వచ్చే నాలుగేళ్లలో 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించామని ఆయన తెలిపారు. గత 6 సంవత్సరాల్లో 2 వేల కోట్ల పెట్టుబడులను తాము తెచ్చామని, తెలంగాణ ఏర్పడక ముందు ఈ రంగంలో 50 వేల ఉద్యోగాలు మాత్రమే ఉండేవని గుర్తు చేశారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత మాత్రం అదనంగా లక్షకు పైగా ఉద్యోగాలను కల్పించామని తెలిపారు.













