మొబిలిటీ రంగంలో దేశంలోనే.. తెలంగాణ అగ్రస్థానం : మంత్రి కేటీఆర్
కొవిడ్ వ్యాక్సిన్ తరహాలో ఈ`మొబిలిటీలోనూ దేశంలో తెలంగాణ అగ్ర స్థానంలో ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలో ఉత్పత్తి అయ్యే ఈ-బ్యాటరీల్లో 60 శాతం మన వద్దే తయారవుతాయన్నారు. శంషాబాద్ జీఎంఆర్ ఏరోసిటీలో అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ నూతనంగా నిర్మిస్తున్న ఈ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్‌కు మంత్రి కేటీఆర్ భూమి పూజా చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ మొబిలిటీలో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న గల్లా జయదేవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిరోజు కొత్తదనం కోరుకోవడంతోనే అమరరాజా సంస్థ ముందుంటుందన్నారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీలోని ప్రారంభించాక ఎన్నో గొప్ప సంస్థలు రాష్ట్రంలో తమ పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నాయన్నారు. ఇక్కడి అనుకూలమైన వాతావరణమే ఇందుకు కారణమన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అమరాజా చైర్మన్ గల్లా జయదేవ్, ఎంపీలు రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, నీతి అయోగ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సలహదారు సుధేందు సిన్హాలు పాల్గొన్నారు.













