నీరా కేఫ్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
నీరా స్టాల్ గౌడ వృత్తి వారి ఆస్థిత్వానికి ప్రతీకగా నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోనే తొలి నీరాకేఫ్ ఏర్పాటుకు హైదరాబాద్ నగరంలోని నెక్లెస్‌రోడ్డులో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల్లో ఎంతో వృతి నైపుణ్యం ఉందన్నారు. రాష్ట్రంలో గీత వృత్తిపై ఆధారపడి 2 లక్షల మంది జీవిస్తున్నారని తెలిపారు. కుల వృత్తుల అభివృద్ధితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందనేది ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకమని సృష్టం చేశారు. ఈ ప్రభుత్వం రూ.16 కోట్ల వృత్తి పన్ను బకాయిలను రద్దు చేసిందని గుర్తు చేశారు. నీరా స్టాల్ గౌడవృత్తి వారి అస్థిత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని నీరా స్టాల్స్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ అన్నారు.
రాష్ట్రంలో కల్లుగీత వృత్తిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సృష్టం చేశారు. కల్లుగీత వృత్తి పన్ను రద్దు కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఈ పన్ను రద్దు కోసం ఏ ప్రభుత్వమూ తీసుకోని నిర్ణయాన్ని ముఖ్యమంతి కేసీఆర్ తీసుకున్నారు. గత పాలకులు కల్లు దుకాణాలు మూసివేయించి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వంలో కల్లుగీత వృత్తి పన్నును రద్దు చేయడంతో పాటు కల్లు దుకాణాలు తెరుచుకున్నాయని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన కల్లుగీత కార్మికులకు ఈ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ఇస్తుందని గుర్తు చేశారు. 1800 చదరపు మీటర్ల స్థలంలో రూ.3 కోట్లతో ఈ కేఫ్‌ను నిర్మించనున్నారు. వెయ్యి చదరపు మీటర్లలో కేఫ్ స్టాళ్లు, 800 చ.మీ. ఓపెన్‌స్పేస్‌లో హుస్సేన్ సాగర్ వ్యూ కనిపించేలా సీటింగ్ ఏర్పాటు చేస్తున్న నీరాకేఫ్ మొత్తంగా చూస్తే తాటాకు ఆకృతిని పోలి ఉంటుంది.













