సైబర్ క్రైమ్ సవాల్ గా మారింది.. భవిష్యత్తులో యుద్ధాలే : కేటీఆర్
సైబర్ క్రైమ్ పెద్ద సవాల్ గా మారిందని, భవిష్యత్తులో సైబర్ యుద్ధాలే జరుగుతాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ రాయదుర్గంలో కొటెలిజెంట్ సైబర్ వారియర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఒఈ)ని ఆయన ప్రారంభించారు. ఈ సెంటర్ ద్వారా సైబర్ సెక్యూరిటీ నిపుణులకు శిక్షణ ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు కొటెలిజెంట్ ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉపాధి కల్పించే వారికి ప్రభుత్వాలు అండగా ఉండాలని అన్నారు. ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగాలు స్వల్పంగానే ఉంటాయని పేర్కొన్నారు.
దేశంలో వంద కోట్లకు పైగా జనాబా ఉందన్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పించాలని కేటీఆర్ సూచించారు. నైపుణ్యం ఉంటే ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానికులకు ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందజేస్తామని అన్నారు. డేటా ప్రొటెక్షన్ చేయూలంటే సైబర్ సెక్యూరిటీ ఉండాల్సిందేనన్న కేటీఆర్ ప్రధాని ట్విట్టర్ ఖాతా కూడా హ్యాకింగ్‌కు గురైందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొటెలిజెంట్ ప్రతినిధులు, రాష్ట్ర, ఐటీ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.













