హైదరాబాద్ కు రెండు రోజుల ముందే సంక్రాంతి : కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అధికారికంగా ప్రారంభించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రహమత్ నగర్లో ఈ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గ్రేటర్ పరిధిలో ఒక్కో కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీటిని అందించనున్నారు. బస్తీల్లో నల్లాలకు మీటర్లు లేకపోయినా ఉచితంగా నీరు అందించనున్నారు. మిగతా ఏరియాల్లో, అపార్ట్మెంట్లలో మీటర్లు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉంది. 20 వేల లీటర్లు దాటిన నీటి వినియోగంపై పాత ఛార్జీలతో జలమండలి బిల్లు వసూలు చేయనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. జనవరిలో జారీ చేసే డిసెంబర్ బిల్లు నుంచే ఈ ఉచిత పథకం అమల్లోకి వస్తుంది. జల మండలికి గ్రేటర్ లో ఉన్న మొత్తం 10.08 లక్షల నల్లా కనెక్షన్లలో 2.37 లక్షల నల్లాలకే మీటర్లు ఉన్నాయి. ఈ పథకంతో 19.92 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఆదా అయ్యే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌కు రెండ్రోజుల ముందే సంక్రాంతి వచ్చిందన్నారు. తాను చదువుకునే రోజుల్లో తాగునీటి కోసం ధర్నాలు జరిగేవని, ప్రస్తుతం ఉచితంగా తాగునీరు అందించే స్థాయికి చేరుకున్నామన్నారు. కులమతాలకు అతీతంగా పేదలంతా అభివృద్ధి చెందాలన్నదే టీఆర్ఎస్ ధ్వేయమని సృష్టం చేశారు. బస్తీల్లోని పేదలకోసం అన్ని సౌకర్యాలు కల్పించాం. బలహీన వర్గాలు పిల్లలను విదేశాలకు పంపి చదివిస్తున్నాం అని కేటీఆర్ వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.













