జాతీయ వృద్ధిరేటు కంటే తెలంగాణ ఐటీ వృద్ధిరేటు ఎక్కువ
జాతీయ వృద్ధిరేటు కంటే తెలంగాణ ఐటీ వృద్ధిరేటు ఎక్కువగా ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లోని తాజ్‌డెక్కన్ హోటల్లో జరిగిన టీ-వ్యాలెట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఖమ్మం, వరంగల్, కరీంనగర్లో త్వరలో ఐటీ కంపెనీలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. టి-బ్రిడ్జి కార్యక్రమం ద్వారా పలు అమెరికా స్టార్టప్‌లను భారత్‌లోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. రావిరాల సమీపంలో 3వేలకు పైగా ఎకరాల్లో ఈ-సిటీ నిర్మాణం చేస్తున్నామని అన్నారు. ఈ-లావాదేవీల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. ప్రస్తుతం టీ వ్యాలెట్ ద్వారా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు చెల్లింపులు చేయవచ్చన్నారు. ఆపిల్ అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లో రానుందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ చేపట్టిన మిషన్ భగీరథ కార్యాక్రమాన్ని అమలు చేసేందుకు 11 రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయని అన్నారు. తెలంగాణను ఎలక్ట్రానిక్ హబ్‌గా రూపొందిస్తున్నామని అన్నారు. ఈ-గవర్నెన్స్ నుంచి ఎం-గవర్నెన్స్ స్థాయికి తీసుకువెళతామని అన్నారు. అన్ని శాఖలను మొబైల్స్‌కు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దును సమర్థించి డిజిటల్ లావాదేవీలు ప్రొత్సహించాం. ఇప్పుడు డిజిటల్ లావాదేవీల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని ప్రకటించారు.













