ఈ ఘనత సాధించిన ఒకే ఒక వ్యక్తి సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి ఎంతగానో ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో నిరుద్యోగ యువతకోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ధాత్రి, భూవి బయో కంపెనీలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ఈ మూడు అంశాలే ప్రధాన లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నామన్నారు. రాష్ట్రం ఏర్పాటైన ఈ 8 ఏళ్లలో ఎంతో ప్రగతి సాధించాం. ఏ రాష్ట్రం చేయని విధంగా ఒక అద్భుతమైన పనిని సీఎం కేసీఆర్ చేశారు. పట్టణాలు, తండాలు, పంచాయతీలు, ఇలా ఎక్కడా ఎలాంటి తేడాలు చూపించకుండా కోటి ఇళ్లకు ఇంటింటికీ నల్లా కలెక్షన్లు ఇచ్చి నీరు అందిస్తున్నాం. రూ.45 వేల కోట్లు ఖర్చు చేసి ఇంటింటికీ మంచినీరు ఇస్తున్నాం. ఈ ఘనత సాధించిన ఒకే ఒక వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు.
75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నీళ్ల విషయంలో దేశంలో ఎక్కడా జరగని పురోగతిని రాష్ట్రంలో చేసి చూపించాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేష్ ప్రాజెక్టును కేవలం నాలుగేళ్లలోనే నిర్మించుకున్నాం. రాష్ట్రంలో మండు వేసవిలో కూడా కాలువల్లో నీరు ప్రవహిస్తోంది. ఉద్యమ నినాదానికి అనుగుణంగా రాష్ట్ర పురోభివృద్ధికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అని కేటీఆర్ అన్నారు.













