వాళ్లు పనిచేస్తే.. సీఎం దాకా రావాల్సిన అవసరం లేదు : మంత్రి కేటీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కలవటం లేదని, ప్రజా దర్బార్ నిర్వహించటం లేదని కొంతమంది చేస్తోన్న విమర్శలకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జీహెచ్ఎంసీ వార్డు అధికారులకు నిర్వహించిన వార్డు ఆఫీసర్స్ ఓరియెంటేషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉద్యోగ వ్యవస్థ, ప్రజాప్రతినిధులు విఫలమైనప్పుడే సమస్య తన వరకు వస్తుందని సీఎం అన్నారని తెలిపారు. అందుకే రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు తీసుకువచ్చి, పాలనను ప్రజల వద్దకు చేర్చారని తెలిపారు.
కేసీఆర్ ప్రజా దర్బార్ ఎందుకు నిర్వహించడం లేదని కొందరంటున్నారని కేసీఆర్‌తో చెబితే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి మొదలుకొని కిందిస్థాయిలో పనిచేసే ఉద్యోగి వరకు ఆరున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. సామాన్య వ్యక్తి పింఛను, రేషన్ కార్డు, నల్లా కోసమే, పాస్‌బుక్‌లో పేరు ఎక్కట్లలేదనో సీఎంకు చెప్పుకొనే పరిస్థితి వచ్చిందంటే వ్యవస్థలో ఏదో లోపం ఉంది. యంత్రాంగం సరిగా పని చేయడం లేదని నాకు అర్థమవుతోంది. సామాన్యులకు ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలి. వీరితో నెరవేరని సమస్యలు జఠిలమైనవి ఏమనా ఉంటే సీఎం వరకు రావాలి. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు ఎవరి స్థాయిలో వాళ్లు ఉండి పనిచేస్తే సీఎం దాకా రావాల్సిన అవసరం లేదన్నారు అని అన్నారు.













