వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే… మన మద్దతు లేకుండా ఎవరూ ప్రధాని కాలేరు
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని, మన మద్దతు లేకుండా ఎవరూ ప్రధాని కాలేరని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చేనేత వారోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నేతన్నల సంక్షేమం కోసం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు. చేనేత మిత్ర పేరుతో నూలు, రసాయనాల మీద 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. చేనేత ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత ఉంది. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన నైపుణ్యం ఉన్న నేతన్నలు మన తెలంగాణ నేతన్నలు. ఉప్పల్లో హ్యాండ్లూమ్ మ్యూజియంను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పోచంపల్లి చేనేత కళాకారులు భాగస్వాములై వినియోగించుకోవాలి. నేత కార్మికులను సంఘటితం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అండగా ఉంటుంది. మాది కోతల ప్రభుత్వం కాదు, మాది చేతల ప్రభుత్వం, చేనేతల ప్రభుత్వం అని అన్నారు. 2021లో భూదాన్ పోచంపల్లిలో నేతన్నలను కాపాడుకునే ప్రయత్నం చేశామని తెలిపారు.













