మునుగోడు జన బలం.. ధన బలంకు మధ్యనే పోటీ
అక్రమ కాంట్రాక్టులతో రాజగోపాల్ సంపాదించిన ధన బలానికి, మునుగోడు జన బలానికి మధ్యే పోటీ ఉందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధనదాహం కోసమే మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందనే విషయాన్ని నియోజకవర్గ ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. రాజగోపాల్ అట్టర్ ఫ్లాప్ ఎమ్మెల్యే అని, తన కాంట్రాక్టుల కోసం నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రలోభాలతో ప్రజల్ని మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. బీజేపీ, రాజగోపాల్కు బుద్ధి చెప్పేందుకు మునుగోడు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గాన్ని రాజగోపాల్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని, ప్రజల కష్ట సుఖాలను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం తన కాంట్రాక్టుల గురించి మాత్రమే ఆలోచించే ఫక్తు రాజకీయ వ్యాపారి రాజగోపాల్ అని విమర్శించారు.













