ఆ ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు : కేటీఆర్
తెలంగాణకు ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇస్తామని విభజన చట్టంలో పేర్కొన్నప్పటికీ ఆరున్నరేళ్లలో కేంద్రం నుంచి ఒక్క పైసా సాయం కూడా రాలేదని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్లో రూపొందించిన చట్టాన్నే కేంద్రం తుంగలో తొక్కిందని విమర్శించారు. ఆత్మనిర్భర్ ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీఎస్ ఐపాస్, గొర్రెల పంపిణీ, నర్సంపేటలో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తదితర అంశాలకు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఆరేళ్లలో టీఎస్ ఐపాస్ ద్వారా రూ.2.13 లక్షల కోట్ల పెట్టుబడులు ఆర్షించామని తెలిపారు. పారిశ్రామిక వికేంద్రీకరణలో భాగంగా హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలతో పాటు జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్టు కేటీఆర్ స్పష్టం చేశారు.
కేంద్రం చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వమే గౌరవించాలని కోరారు. ఆత్మనిర్భర్ ప్యాకేజీ వల్ల తమకు ఎలాంటి ఉపయోగం లేదని వ్యాపార వేత్తలే చెబుతున్నారు. వీధి వ్యాపారులకు మాత్రం రూ.10 వేల రుణ సాయం పొందేందుకు కొంతమేర ఉపయోగపడినట్టు తెలుస్తోందన్నారు. ఆ ప్యాకేజీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో పండే పంటలకు అనుగుణంగా పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో రాష్ట్ర పుడ్ ప్రాసెసింగ్ మ్యాప్ రూపొందించామన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రారంభం కాగా, మరికొన్ని సిద్ధంగా ఉన్నట్టు వివరించారు. రైతు బంధు సమితుల ద్వారా అన్నదాతలను సంఘటితం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.













