అమెరికా-ఇండియా సమ్మిట్ లో మంత్రి కేటీఆర్
వివిధ రంగాల్లో స్వయంసమృద్ధి సాధించాలంటే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. వర్చువల్ విధానంలో జరిగిన యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరం నిర్వహించిన అమెరికా- ఇండియా సమ్మిట్‌లో కేటీఆర్ ప్రసగించారు. ప్రస్తుత ఆపత్కాలంలోనూ అవకాశాలున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల నుంచి పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకురావడానికి భారత్‌కు అవకాశం ఉన్నదని కేటీఆర్ అన్నారు.
పెట్టుబడిదారులు యావత్ భారతాన్ని ఒకే రీతిలో చూడకుండా, దేశంలో ఉన్న వివిధ ప్రగతిశీల రాష్ట్రాలు చేపడుతున్న కార్యక్రమాలు, వాటి విధానాలను గమనించాలని కోరారు. ఆ దిశగా రాష్ట్రాలతో పెద్దఎత్తున కంపెనీలు రాష్ట్రానికి వచ్చేలా చేశామని గుర్తు చేశారు. ప్రపంచదేశాలతో కలిపి తెలంగాణకు సులభ వాణిజ్య విధానం (ఈవోడీబీ)లో పోటీ కల్పిస్తే రాష్ట్రం ప్రపంచంలోనే టాప్- 20లో ప్రతిభ ఉన్న యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం తెలంగాణ ప్రభుత్వం టాస్క్ ఏర్పాటు చేసి, ఐదేండ్లల్లో నైపుణ్య శిక్షణలో సేవలు అందిస్తున్నదని చెప్పారు.
విద్యార్థులు చదువుకుంటూనే పనిచేసుకునే వెసులుబాటు కల్పించే డ్యూయల్ డిగ్రీ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో డిజిటలైజేషన్‌తోనే అనేక సేవలు అందుకునే అవకాశం ఉన్నదని, విద్య విషయంలో డిజిటలైజేషన్ ముఖ్యమని చెప్పారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం టీసాట్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నదని తెలిపారు. భారతదేశంలో ఇన్నోవేషన్‌ను మరింత ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉన్నదని, ఈ దిశగా తమ ప్రభుత్వం ఐదేండ్ల కిందట దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా వీహబ్‌ను, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్, టీవర్కస్ వంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నామని వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను ప్రస్తుతం వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 2020 సంవత్సరానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్‌గా ప్రకటించిందని పేర్కొన్నారు. దీని ద్వారా హెల్త్‌కేర్, వ్యవసాయరంగాలను మరింత బలోపేతం చేసేందుకు ముందుకొచ్చే ఎవరికైనా ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.













