మానవీయ కోణంలో కార్మికులకు అండగా నిలుద్దాం!
విపత్కర పరిస్థితుల్లో కార్మికులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు పరిశ్రమల యాజమాన్యాలపై ఉన్నదని రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి అన్ని జిల్లాల కార్మిక, పరిశ్రమల శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వ్యాప్తిని అరికట్టుటకై ప్రకటించిన లాక్డౌన్ తో గత నెలరోజుల నుండి దాదాపు అన్ని రకాల పరిశ్రమలు మూతపడ్డాయని తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించరాదని స్పష్టం చేశారు. పరిశ్రమలకు కూడా విద్యుత్ బిల్లులు, ఆస్తిపన్ను చెల్లింపులో ప్రభుత్వం కొంత వెసులుబాట్లు కల్పించినట్లు తెలిపారు. ఏ పరిశ్రమకు విద్యుత్ సరఫరా నిలిపివేయరాదని స్పష్టంగా ఆదేశించినట్లు తెలిపారు.
శాశ్వత ఉద్యోగులతో పాటు వివిధ రాష్ట్రాలు, చుట్టుప్రక్కల జిల్లాల నుండి వచ్చిన వలస కార్మికుల సంక్షేమాన్ని కూడా చూడాల్సిన బాధ్యత మనపై ఉన్నదని తెలిపారు. మానవీయ కోణంలో వలస కార్మికులకు కూడా 12 కిలోల బియ్యాన్ని, రూ. 500 నగదును ప్రభుత్వం ఇస్తున్నదని తెలిపారు. ఇంకా ఈ సాయం అందని వలసకార్మికుల వివరాలు సేకరించాలని కూడా మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అభివృద్దిలో వలస కార్మికులు కూడా భాగస్వాములేనని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినందున వారికి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని మంత్రి కోరారు. ఫ్యాక్టరీల వద్ద ఉండిపోయిన కార్మికులకు నిత్యావసరాలు అందించాల్సిన బాధ్యత తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేషన్కార్డులేనివారికి కూడా బియ్యం, నగదును మంజూరుచేసే అధికారాలను జిల్లా కలెక్టర్లకు కల్పించినట్లు తెలిపారు.
కరోనా భయాందోళనలు, లాక్డౌన్ పొడగింపు నేపథ్యంలో ఎటువంటి పనులు చేయకుండా ఖాళీగా ఉంటున్న కార్మికులలో తమ ప్రాంతాలకు వెళ్లాలనే భావన కలుగుతుందని తెలిపారు. అయితే వలస కార్మికులు రోడ్లపైకి రావడం వలన ఇంతవరకు అమలు చేసిన లాక్డౌన్ లక్ష్యం దెబ్బతింటుందని తెలిపారు. ఎక్కడ ఉన్న కార్మికులను అదే ప్రదేశంలో ఉంచాలని ఆదేశించారు. ఈ అంశంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అధికారులను కోరారు. అవసరం అయినచోట్ల పని ప్రదేశాల్లోనే ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఇ.ఎస్.ఐ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో పాటు అందుబాటులో ఉన్న ప్రైవేట్ వైద్యుల సేవలను కూడా తీసుకోవాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయపడేందుకు ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్ నెంబర్లను కార్మికులకు అందజేయాలని సూచించారు. అత్యవసర సేవలను అందించుటకై కొన్ని రకాల పరిశ్రమలను నడుపుటకు ప్రభుత్వం గతంలోనే వెసులుబాటు కల్పించినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ఇటువంటి పరిశ్రమలలో వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
మంత్రి మల్లా రెడ్డి మాట్లాడుతూ కార్మిక శాఖ అధికారులు పరిశ్రమ శాఖ అధికారులతో సమన్వ్యయం చేసుకుని కార్మికులకు, ముఖ్యంగా వలస కార్మికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. వలస కార్మికులను ఈ కొన్ని రోజులు కాపాడుకుంటే లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం ఆర్థిక వ్యవస్థ త్వరగతిన గాడినపడే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్, కమిషనర్ మాణిక్‌రాజ్, కార్మిక శాఖ కమిషనర్ నధీమ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. వేతనాలు, వలస కార్మికుల సమస్యల గురించి తెలియజేయడానికి తెలంగాణ కార్మిక శాఖ హెల్ప్‌లైన్ 9492555379 ఏర్పాటు చేసింది.













