‘‘మీరే నిజమైన హీరో కేటీఆర్ గారూ’’…. : సోనూసూద్ ట్వీట్

తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కే. తారక రామారావును అభినందిస్తూ బాలీవుడ్ నటుడు సోనూసూద్ ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. అయితే తెలంగాణకు చెందిన నందకిశోర్ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. తమకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ కావాలని మంత్రిని సంప్రదించగా, కేవలం 10 గంటల్లోపే తమకు మంత్రి కేటీఆర్ వాటిని సమకూర్చారని, ఆయన చేసిన మేలు మరిచిపోలేమని పేర్కొన్నాడు. ‘‘కేటీఆర్ నిజమైన హీరో’’ అంటూ నంద కిశోర్ ట్వీట్ చేశాడు. అయితే ఈ నందకిశోర్ చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ రీట్వీట్ చేశారు. ‘‘నేను ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకుడ్ని. తనకు చేతనైనంత సహాయం చేస్తా. సూపర్ హీరో నేను కాదు. సూపర్ హీరో అని సోనూసూద్‌ను పిలవండి’’ అంటూ కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు స్పందించిన సోనూసూద్
మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై నటుడు సోనూసూద్ స్పందించారు. కేటీఆర్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు ప్రకటించారు. సూపర్ హీరో తాను కాదని, కేటీఆరే నిజమైన హీరో అని సోనూసూద్ ట్వీట్ చేశారు. ‘‘కేటీఆర్‌కు ధన్యవాదాలు. తెలంగాణ ప్రజల కోసం ఎంతో చేస్తున్న మీరే నిజమైన హీరో. మీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తోంది. తెలంగాణను నా రెండో ఇల్లుగా నేను భావించుకుంటా. తెలంగాణ ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానం నిరుపమానం’’అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు.