Minister Komatireddy: రేవంత్ రెడ్డే మళ్లీ సీఎం అవుతారు :మంత్రి కోమటిరెడ్డి
కృష్ణా జలాలపై మాజీ సీఎం కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నాడని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి (Gummula Mohan Reddy) ఆధ్వర్యంలో నల్లగొండలో భారీ యువ చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కోమటి రెడ్డి మాట్లాడుతూ తాను అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఏపీ రాష్ట్ర సీఎం జగన్‌కు (Jagan) వత్తాసు పలికి తెలంగాణకు అన్యాయం చేశాడని మండిపడ్డారు. 24 నెలలుగా ఫామ్‌హౌస్ కే పరిమితమైన కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు. రెండేళ్ల తర్వాత తమ ప్రభుత్వ లెక్కలు చూస్తానంటున్న కేసీఆర్, ముందు ఆయన కూతురు కవిత అడిగిన లెక్కలకు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లు ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం రెండేళ్లలో పూర్తి చేస్తుందన్నారు. రాష్ట్రంలో మూడేళ్ల తర్వాత మళ్లీ రేవంత్ రెడ్డే సీఎం అవుతారని స్పష్టం చేశారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం త్యాగాలు చేశారని, 3 సార్లు ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా సోనియా గాంధీ దేశ శ్రేయస్సు కోసం విలువైన సలహాలిచ్చారని కోమటి రెడ్డి చెప్పారు. సోనియాగాంధీ ఆలోచన నుంచి వచ్చిన ఉపాధి హామీ పథకంలో మహత్మాగాంధీ పేరును తొలగించాలని చూడటం అత్యంత దుర్మార్గమని విమర్శించారు.






