వరద ముంపు ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన
హైదరాబాద్‌లోని వరద ముంపు ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని మల్లికార్జున నగర్, బాపూ నగర్, ప్రేమ్‌నగర్‌తో పాటు మరిన్ని కాలనీల్లో కిషన్ రెడ్డి పర్యటించారు. హైదరాబాద్ నగరంలో వరదల కారణంగా మౌలిక వసతులు దెబ్బతిని లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారని.. ప్రజలకు కనీస అవసరాలైన నీరు, పాలు కూరగాయలకు ఇబ్బంది ఏర్పడే పరిస్థితులున్నాయని అన్నారు. హిమాయత్‌నగర్‌లోని దత్తానగర్, జనార్దన్వాడ, ఖైరతాబాద్‌లోని ఓల్డ్ సీబీఐ క్వాటర్స్, బీజేఆర్, గణేష్‌నగర్‌లో పర్యటించి జరిగిన నష్టంపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓపెన్ నాలాల్లో తూతూమంత్రంగా పూడిక తీస్తున్నారని.. సాంకేతికతను వినియోగించుకోవడంలో జీహెచ్ఎంసీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.













