రాష్ట్రం బంగారుపళ్లెం కాదు.. అప్పుల కుప్పగా మార్చారు
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగానే పారిశ్రామికవేత్త అదానీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు ఇచ్చింది. రాష్ట్రం బంగారుపళ్లెం కాదు, అప్పుల కుప్పగా మార్చారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారు. రూ.40 వేల కోట్లు వడ్డీలకే పోతోంది. బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకు పార్లమెంటులో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఇరుపార్టీల స్నేహాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. అందువల్లే రూ.వేల కోట్లు కుమ్మిరించినా శాసనసభలో ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలవలేదు. 2018 ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ చాలా హామీలు ఇచ్చి అమలు చేయలేదు. గతంలో విపక్షాలు టీఆర్ఎస్ను రెండేళ్ల తర్వాత విమర్శిస్తే పసికందును విమర్శిస్తున్నారా? అని వాపోయారు. మరి బీఆర్ఎస్ నేతలు 2 నెలలు కూడా ఎందుకు ఆగలేకపోతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేసింది. మిగతా గ్యారంటీల అమలు కోసమే ప్రజాపాలన నిర్వహించాం. దరఖాస్తుల పరిశీలన పూర్తి కాగానే మిగతావి అమలు చేస్తాం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారు. బీఆర్ఎస్ను వీడటానికి ఇప్పటికే చాలా మంది సిద్దంగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో ఆ పార్టీ ప్రతినిధులే అవిశ్వాసాలు పెడుతున్నారు. గత రెండేళ్లలో కృష్ణా బేసిన్లో నిండుగా నీరు ఉన్నప్పటికీ సాగుకు ఇవ్వలేదు. ఈ ఏడాది వర్షాలు లేక నాగార్జున సాగర్లో జలాలు అడగంటిపోయాయి. కృష్ణా బేసిన్లో నీరు లేనప్పుడు రెండో పంటకు ఇవ్వడం ఎలా సాధ్యం అని అన్నారు.













