ఈ -పరిపాలనలో తెలంగాణకు అండగా ఉంటాం : కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
దేశంలో డిజిటల్ విప్లవం ప్రజల జీవనశైలిలో అంతర్భాగం అయిందని కేంద్ర శాస్త్ర, సాంకేతికాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. కరోనా అనంతరం ప్రపంచంలో డిజిటల్ పాలన, భారతదేశం పాత్ర పేరిట హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నిర్వంచిన 24వ జాతీయ ఈ-పరిపాలన సదస్సును తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి కేంద్ర మంత్రి ప్రారంభించారు.
అనంతరం జితేంద్రసింగ్ మాట్లాడుతూ ప్రజలు సులభతరంగా జీవించేలా చేయడమే ఈ-పరిపాలన ముఖ్య ఉద్దేశమన్నారు. అంతర్జాతీయ సూచికల స్థాయిలో తెలంగాణలో ఈ`పరిపాలన ప్రాజెక్టుల అమలుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కరోనా మహ్మారితో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను అవకాశంగా మలుచుకుని ఈ-పరిపాలనతో ప్రజలకు మెరుగైన సేవలందించామన్నారు. తెలంగాణలో అమలవుతున్న జనహిత ప్రాజెక్టు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమన్నారు. అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అంతరిక్ష పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, ఈ జాబితాలో హైదరాబాద్ కూడా ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, గతంలో ఇక్కడ కేటాయించి రద్దు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును పున పరిశీలించాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏడేళ్లలో ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్ల నుంచి రూ.1.45 లక్షల కోట్లకు చేరాయన్నారు. రాష్ట్రానికి మంజూరైన రెండు ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లలో తయారీ మొదలైందని, భారత్‌లో తయారీ లో భాగంగా మరో రెండు క్లస్టర్లు మంజూరు చేయాలన్నారు. భారత అంతరిక్ష పరిశోధనలో హైదరాబాద్ భాగస్వామ్యం ఉందని, చంద్రయాన్ ప్రాజెక్టులో 30 శాతం పరికరాలు ఇక్కడ పరిశ్రమల్లోనే ఉత్పత్తయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.













