దేశ ప్రజల మీద రోజుకో బండ వేస్తున్నదెవరు?
కేంద్రమంత్రి గానీ, బీజేపీ ఎంపీలు గానీ రాష్ట్రానికి నిధులేమైనా తెచ్చారా అని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల నెత్తిమీద రోజుకో బండ వేస్తున్నదెవరు? పెట్రోల్, డీజిల్ ధర వందకు పైగా చేసిందెవరు? బీజేపీ షాక్ ఇచ్చేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు అని అన్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో, టీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రజలమందుకు పెట్టి చర్చ చేద్దామా? అందుకు కిషన్ రెడ్డి సిద్ధామా? అని ప్రశ్నించారు. పార్లమెంట్లో ఎవరు ఏ ప్రశ్న అడిగినా తెలంగాణకు పొగడ్తలే తప్ప నిధులు ఇచ్చింది లేదన్నారు. బీజేపీ నేతలు పార్లమెంట్లో ఓ విధంగా మీడియా ఎదుట మరో విధంగా మాట్లాడుతున్నారు అని విమర్శించారు. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో రూ.వేల కోట్లు కేంద్రాన్ని వెళ్తున్నా రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులే సక్రమంగా ఇవ్వట్లేదని విమర్శించారు. మిషన్ భగీరథ చక్కని పథకం నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం స్పందించలేదన్నారు.













