ఎన్ని దాడులు చేసినా తాము ప్రజల పక్షమే : మంత్రి జగదీశ్ రెడ్డి
బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి పై జరుగుతున్న ఐటీ దాడులపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై జరిగే ఐటీ దాడులు బీజేపీ ప్రేరేపిత దాడులే అని పేర్కొన్నారు. బీజేపీ విచారణ సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలపై దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసులు పెట్టి భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా తెరిచిన పుస్తకాలే, వైట్ పేపర్ వ్యాపారాలే అని మంత్రి స్పష్టం చేశారు. పార్టీలోకి రాక ముందే నుండే వారికి వ్యాపారాలు ఉన్నాయని తెలిపారు. పన్నులు లెక్క ప్రకారమే చెల్లిస్తున్నారు. ఐటీ దాడులతో భయపెట్టడం మూర్ఖత్వమే. దాడులకు భయపడేదిలేదు. దాడులతో ప్రజలను, ప్రతిపక్షాన్ని అణచివేయడం అప్రజాస్వామికం. బీజేపీది రాజకీయ కక్షే, ఎన్ని దాడులు చేసినా తాము ప్రజల పక్షమే అని మంత్రి తేల్చి చెప్పారు.













