తెలంగాణ దేశానికే రోల్ మోడల్ : మంత్రి జగదీశ్ రెడ్డి
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించి దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పాలనలో దేశంలో తిరోగమనం చెందుతుందని ఆరోపించారు. తెలంగాణలో సాగుతున్న సుభిక్షమైన పాలనను దేశ ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ కేవలం తెలంగాణకే పరిమితం చేయాలని బీజేపీ ఎన్నో కుట్రలు చేస్తున్నదని, ఇందులో భాగంగానే రాష్ట్రంపై కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో అనేక రకాల మోసాలకు, ద్రోహాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు.
తెలంగాణ రైతుల పక్షాన టీఆర్ఎస్ ఎంతకైనా కొట్లాడుతుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి బీజేపీ మోసాలను ఎండగట్టాలన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేంద్రంపై పోరాటం చేస్తామని, వడ్లు కొనేదాక కేంద్రాన్ని విడిచిపెట్టమని హెచ్చరించారు. బీజేపీ పార్టీ దేశానికే ప్రమాదకరంగా మారిందని, ముఖ్యంగా రైతుల పాలిట శనిలా దాపురించిందన్నారు.













