అధికారంలో ఉన్న గుజరాత్ లో ఏం సాధించారు? : మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్, కిషన్ రెడ్డి పోటీ పడి విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్ గురించి మాట్లాడే బీజేపీ, అధికారంలో ఉన్న గుజరాత్లో ఏం సాధించారో ప్రజలకు తెలపాలన్నారు. అప్పుల గురించి మాట్లాడే నాయకులు అభివృద్ధిని గమనించడం లేదని విమర్శించారు. ప్రపంచం మొత్తం మెచ్చుకునే రైతు బీమా, ఉచిత కరెంటు గుజరాత్లో ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అప్పుచేసి రాష్ట్ర అభివృద్ధికే ఉపయోగించిందని తెలిపారు. దేశంలో అదానీ, అంబానీలకు ఉపయోగపడే విధంగా బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసి ఏం సాధించారని ప్రశ్నించారు. ఆదానీ, అంబానీ వంటికొద్ది మందికి మాత్రమే ఉపయోగపడే విధంగా కేంద్రం మాఫియా ప్రభుత్వాన్ని నడిపిస్తోందని ఆరోపించారు. ప్రపంచ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం భారతదేశ పరువు తీస్తోందని దుయ్యబట్టారు. రాజకీయ పబ్బం కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని న్నారు. బీజేపీ నిర్వాహకం వల్లనే చచ్చిన కాంగ్రెస్ ఉరుకులు పెడుతోందని అన్నారు. కాంగ్రెస్కు చెప్పకోవడానికి ఏం లేదు కానీ, గత్యంతరం లేకనే కర్ణాటకలో కాంగ్రెస్కు పట్టం కట్టారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ నీడను ప్రజలు వదలరని మంత్రి ధీమా వ్యక్త చేశారు.













