రావడం, రాక పోవడం ఆమె విజ్ఞతకే : మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది చూసి ప్రగతి నిరోధకులు తట్టుకులేక పోతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసై గైర్హాజర్ అందులో భాగమేనని ఆరోపించారు. ప్రారంభోత్సవానికి రావడం, రాక పోవడం ఆమె విజ్ఞతకే వదిలి పెడుతున్నామన్నారు. గైర్హాజర్తో గవర్నర్ నిజ స్వరూపం బట్టబయలు అయిందని పేర్కొన్నారు. నూతన సచివాలయం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు. అటువంటి భవనాన్ని నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. మంచిని మంచిగా చూసే గుణం ప్రతిపక్షాలకు ఉండక పోవడం దురదృష్టకరమన్నారు. జరుగుతున్న అభివృద్దితో తమ అడ్రస్ శాశ్వతంగా గల్లంతు అవుతుందన్న బెంగ విపక్షాలను వెంటాడుతుందన్నారు. అందుకే అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఇటువంటి వారికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.













