అది గల్లీలో కాదు… ఢిల్లీలో చేయాలి : మంత్రి జగదీశ్ రెడ్డి
ఉద్యోగల భర్తీపై తాము చర్చకు సిద్ధమేనని, ఇందుకు కాంగ్రెస్, బీజేపీ సిద్దమేనా? అని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పదేళ్ల నుంచి పదివేల ఉద్యోగాలను భర్తీ చేయలేకపోయారని అన్నారు. నిరుద్యోగో మార్చ్ అంటూ హడావుడి చేయడం ముమ్మాటికి నిరుద్యోగులను వంచనకు గురి చేయడమేనన్నారు. నిరుద్యోగ మార్చ్ చెయాల్సి వస్తే అది గల్లీలో కాదని ఢల్లీిలో చేయాలని సూచించారు. ఇక్కడ చేసేది రాజకీయ నిరుద్యోగ మార్చ్ అని అన్నారు. అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాల భర్తీ అంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోదీకి వ్యతిరేకంగా మార్చ్ నిర్వహించాలన్నారు. ఉద్యోగాల భర్తీ దేవుడెరుగు సంవత్సరానికి 2 లక్షల మంది ఉద్యోగులను వీధినపడేసిన ఘనత మోదీ అంటూ విమర్శించారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ దిక్కుమాలిన పార్టీగా మారిందని, అలాంటి పార్టీకి తెలంగాణలో ఉన్నది నాలుగే ఈకలన్నారు. ఆ నాలుగు ఈకలు కూడా ఎవరిగోలలో వారే ఉన్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఆడుతున్న క్షుద్ర రాజకీయాలతో లీకేజీల ప్రహసనం ఓ భాగమని ఆయన మండిపడ్డారు. దేశాన్ని ఏలుతున్న పార్టీకి రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి లీకేజీలో అడ్డంగా దొరికిపోయాడంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి బీ టీంగా పని చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు.













