ఈసారి కూడా రామ నవమి వేడుకలు నిరాడంబరమే : ఇంద్రకరణ్ రెడ్డి
కరోనా కారణంగా భద్రాద్రిలో ఈసారి రామనవమి వేడుకలను అత్యంత నిరాడంబరంగా జరుపుతామని తెలంగాణ దేవాదాయ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. గతేడాది కూడా నిరాడంబరంగానే నిర్వహించామని, ఈసారికూడా పరిమిత సంఖ్యలోనే భద్రాద్రిలో ఉత్సవాలను జరుపుతామని ఆయన వెల్లడించారు. స్వామి వారి ఆలయంలోనే, ఆగమ శాస్త్రం ప్రకారం నవమి వేడుకలను నిర్వహిస్తామని, కరోనా దృష్ట్యా భక్తులెవరూ సీతారామ కల్యాణాన్ని వీక్షించడానికి భద్రద్రికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయమని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శ్రీరామ నవమి వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో వీక్షించాలని కోరారు. ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తుల డబ్బులు తిరిగి వారికి ఇచ్చేస్తామని ఇంద్రకరణ్ పేర్కొన్నారు.













