డిసెంబర్ 31 వరకు వంద శాతం పూర్తి చేయాలి
ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు వంద శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులను తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. కొవిడ్ పరిస్థితులపై మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో కలెక్టర్లు, వైద్యాధికారులు, విద్యా శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. కొవిడ్ పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్‌తో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వచ్చినందున మూడవ దశను సమర్థ వంతంగా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలన్నారు. వ్యాక్సిన్ తక్కువ జరిగిన ప్రాంతాలను గుర్తించి జిల్లా కలెక్టరులు, వైద్య అధికారులు ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో నూరు శాతం పూర్తి చేయాలని సూచించారు. గ్రామాలు, మండలాలు, వార్డులు, మున్సిపాలిటీలలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయుటకు పోటీతత్వం పెంచాలని సూచించారు.













