తెలంగాణలోనూ ఆయన వల్ల బీజేపీ పతనం
సొంత రాష్ట్రంలోనే బీజేపీని గెలిపించుకోలేని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణలో గెలిపిస్తారా? అని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పడ్తనపల్లిలో టీఎంసీ సామర్థ్యం ఉన్న ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకుంటే మీ పార్టీ పరువైనా దక్కుతుందన్నారు. నడ్డా తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డ. తెలంగాణలో హంగ్ కాదు బీఆర్ఎస్ హాట్రిక్ కొడుతుందన్నారు.
కర్ణాటకలో బీజేపీని బీఎల్ సంతోష్ భ్రష్టు పట్టించారు. తెలంగాణలోనూ ఆయన వల్ల బీజేపీ పతనం ఖాయం అని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నందున మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఇప్పటికే మండలానికి వైద్య కళాశాలలను మంజూరు చేసినట్లు తెలిపారు. మరోసారి విజయం సాధిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేసే అవకాశం దక్కుతుందన్నారు.













