ఇవాళ తెలంగాణ దేశానికే ఆదర్శం : మంత్రి హరీశ్‌రావు
కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ ఇవాళ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మంత్రి మాట్లాడారు. కేంద్రం, ఆర్బీఐ లెక్కలే రాష్ట్ర అభివృద్ధిని చెప్తున్నాయన్నారు. రాష్ట్ర జీఎస్డీపీ రూ.11.54 లక్షల కోట్లకు చేరిందని, ప్రజల తలసరి ఆదాయం రూ.2.78 లక్షలకు చేరిందన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో సాధించలేని అభివృద్ధిని మేం 6 ఏళ్లలో సాధించామన్నారరు. నిర్మాణాత్మక విమర్శలు చేస్తే మేం స్వీకరిస్తామన్నారు. తాగునీరు, విద్యుత్ రావట్లేదని ప్రతిపక్షాలు అడగట్లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవాలన్నారు.
తెలంగాణ వచ్చేనాటికి 7,750 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉంది. ఇప్పుడు 17,800 మెగావాట్ల విద్యుత్ అందిస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కోసం రూ.9వేల కోట్లు, కేసీఆర్ కిట్ కోసం రూ.1700 కోట్లు, రైతుబంధు కోసం రూ.54 వేల కోట్లను ఖర్చు చేశాం. రైతుబంధును కేంద్రం, మరికొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో రైతులు బోర్టు వేసి నష్టపోయి ఆత్మహత్మ చేసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుభీమా అమలు చేస్తున్నాం అని మంత్రి తెలిపారు.













