అధికారం కోసం ఏదైనా చేసేందుకు.. ఆ పార్టీ నేతలు సిద్దం
బీజేపీ క్షుద్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదో తరగతి పేపర్ లీకేజీల వ్యవహారంలో సూత్రధారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయేనని ఆరోపించారు. బీజేపీకి దిగజారుడు రాజకీయాలని, అధికారం కోసం ఏదైనా చేసేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. పిల్లల భవిష్యత్‌తో ఆటలాడతారా? అని మండిపడ్డారు. దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలని సవాల్ చేశారు. పట్టపగలు స్పష్టంగా దొరికిన దొంగ బండి సంజయ్ అని ఆరోపించారు.
వాట్సప్‌లో ప్రశ్నపత్రం పెట్టిన నిందితుడు ప్రశాంత్ బీజేపీ కార్యకర్తా? కాదా? సంజయ్‌కు అతడు ప్రశ్నపత్రం పంపించింది నిజమా? కాదా? రోజుకో పేపర్ లీకేజీ పేరుతో బీజేపీ కుట్రలు పన్నిన మాట వాస్తవమా? కాదా? సంజయ్‌కు ప్రశ్నపత్రం పంపిన ప్రశాంత్ 2 గంటల్లో 142 సార్లు ఫోన్లో మాట్లాడాడు. అందులో భాగంగా సంజయ్‌కు కూడా ఫోన్ చేశాడు. ఇది నిజమా? కాదా? ఈ ప్రశ్నలకు బీజేపీ నేతలు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ నిందితుల విడుదల కోసం బీజేపీ నేతలు ధర్నా చేశారని విద్యార్థులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలకు చదువు విలువ తెలియదని ఆక్షేపించారు. ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు బీజేపీకి గుణపాఠం చెప్పాలని అన్నారు. బండి సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరుతున్నట్లు తెలిపారు.













