ఇలాంటివి పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ..బీజేపీకి మంత్రి గంగుల హెచ్చరిక
బీజేపీ నేతల తీరు మారకపోతే తీవ్ర పరిణామాలుంటాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య ఘర్షణకు దారితీశారు. దీంతో మంత్రి క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య ఇంటిపై బీజేపీ దాడి చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్భంగా ఆగయ్యను మంత్రి పరామర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ గోపి అనే వ్యక్తి తుపాకీ పట్టుకొని వచ్చారని, కొంత మంది బీజేపీ కార్యకర్తలు కట్టెలు పట్టుకొని దాడికి వచ్చారని తెలిపారు. ఇలాంటివి పునరావృతమైతే బీజేపీ నేతల ఉనికి లేకుండా చేస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారు. మంచితనాన్ని కమలం నేతలు అలుసుగా తీసుకోవద్దన్న అన్నారు. తాజా ఘటనపై బండి సంజయ్ స్పందించాలని డిమాండ్ చేశారు. యూపీ, గుజరాత్, బీహార్ సంస్కృతిని బీజేపీ నమ్ముకుందన్నారు. తమపై దాడులు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.













